Bhumana Karunakar Reddy: కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేశ్ డైరెక్షన్లో దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ ఘటనలకు గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో కత్తులు, కర్రలతో దాడి చేశారని భూమన ఆరోపించారు. మిథున్‌రెడ్డి సౌమ్యుడని, ఆయన ఎలాంటి వ్యక్తో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. కర్ణాటక నుంచి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు అధికారంలో ఉన్నవారు రేపు ఇదే పరిస్థితిలో ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ పేరును గూండాల పార్టీగా మార్చుకోవాలని భూమన ఘాటుగా వ్యాఖ్యానించారు. హింస, దాడులే టీడీపీ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎంపీపై దాడి చేయడమే కాకుండా, తిరిగి తమవారే దాడులు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఫేక్ ఏఐ వీడియోలతో బోగస్ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, పక్కా ప్రణాళికతోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేశారని భూమన ఆరోపిస్తూ, ఈ ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. నిన్న ఎంపీ మిథున్‌రెడ్డిపై, నేడు తిరుపతి ఎంపీ గురుమూర్తిపై దాడులకు తెగబడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జరుగుతున్న ఘటనలను ప్రజలంతా గమనిస్తున్నారని, రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరుగుతున్నాయని విమర్శించారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.

