వాడు.. డాక్టర్ కాదు కంత్రీగాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడి మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఆడ పిల్లలను తల్లి గర్భాశయంలోనే చంపేస్తున్నాడు. గతంలో ఓ ఆస్పత్రిలో ఇలాంటి దందా చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మళ్లీ అదే దందా షురూ చేశాడు. భువనగిరి జిల్లాలో బ్రూణ హత్యలు చేస్తున్న డాక్టర్ శివకుమార్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం.. ఇది డాక్టర్‌కు తెలియని విషయం కాదు. కానీ కాసులకు కక్కుర్తిపడ్డ ఓ డాక్టర్.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాదు.. ఏకంగా అబార్షన్లు కూడా చేసేస్తున్నాడు. ఇతని పేరు డాక్టర్ శివకుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిని నడుపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో గాయత్రి హాస్పిటల్లో అబార్షన్లు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో, ఆసుపత్రిలో అప్పటికే ఇద్దరు గర్భిణులకు అబార్షన్లు చేసి, వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు గుర్తించారు. పక్కనే పిండాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్రమంగా ఆబార్షన్లు చేసిన డాక్టర్ శివ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
భువనగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి స్కానింగ్ సెంటర్ చట్టవ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన తనిఖీలలో బయటపడింది. మరోవైపు పోలీసులతో పాటు జిల్లా డీఎం అండ్ హెచ్ఓ మాలతి ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. డాక్టర్ శివ కుమార్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు కాదని విచారణలో తేలింది. అంతే కాదు.. ఆసుపత్రికి కూడా అబార్షన్ చేసేందుకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. డాక్టర్ రమ్య , మధు అనే పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసి.. శివ కుమార్ అక్రమంగా ఆసుపత్రి నడిపిస్తునట్లుగా అధికారుల విచారణలో వెల్లడయింది. గతంలో కూడా స్వాతి ఆసుపత్రి పేరు మీద అబార్షన్ చేస్తూ పట్టుబడ్డాడు శివకుమార్. అప్పట్లో స్వాతి ఆసుపత్రి సీజ్ చేశారు అధికారులు. అయినా డాక్టర్ శివకుమార్ బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ గాయత్రీ ఆసుపత్రిగా పేరు మార్చి అబార్షన్లు చేస్తున్నాడు.
లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి స్కానింగ్ సెంటర్.. ఇద్దరు గర్భిణులకు ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పింది. దీంతో మళ్లీ ఆడ శిశువు అని తెలిసి అబార్షన్లు చేయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం స్కానింగ్ సెంటర్‌ను కూడా సీజ్ చేశారు. భువనగిరి జిల్లాలో ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
