Site icon NTV Telugu

తక్కువ చార్జీలు, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్రభుత్వ కొత్త Bharat Taxi రైడ్–హైలింగ్ సేవ..!

Bharat Taxi 1280x720

Bharat Taxi 1280x720

Bharat Taxi: ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) పేరుతో కొత్త రైడ్–హైలింగ్ సేవను త్వరలో ప్రారంభించనుంది. న్యాయమైన చార్జీలు, పారదర్శక వ్యవస్థ, డ్రైవర్ సంక్షేమం, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ సేవ రాబోయే కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీటా వెర్షన్ పనిచేస్తున్నట్లు సమాచారం.

Indore Water Tragedy: ఇండోర్‌లో జల విషాదం.. 11 మంది మృతి

ఇటీవల పంచకులాలో కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ‘భారత్ ట్యాక్సీ’ ప్రారంభాన్ని ధృవీకరించారు. ప్రైవేట్ ట్యాక్సీ యాప్‌లు డ్రైవర్ల ఆదాయంలో పెద్ద శాతం తీసుకుంటున్నాయనే దీర్ఘకాలిక ఫిర్యాదులకు ఈ కొత్త వ్యవస్థ పరిష్కారమని ఆయన అన్నారు. ఈ సేవ ద్వారా లాభమంతా డ్రైవర్ సోదరులకే దక్కుతుందని షా స్పష్టం చేశారు. డ్రైవర్ల ఆర్థిక భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భారత్ ట్యాక్సీ పూర్తిగా డ్రైవర్ ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంది. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఈ సేవను నిర్వహించనుండగా.. అముల్, ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి ప్రముఖ సహకార సంస్థల మద్దతు ఉంది. మధ్యవర్తులను తొలగించి, రైడ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం నేరుగా డ్రైవర్లకే అందేలా ఈ మోడల్ రూపొందించారు. రైడ్ చార్జీలతో పాటు వాహనాల్లో ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కూడా డ్రైవర్లకు కల్పించనున్నారు. ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే 51,000కు పైగా డ్రైవర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

Amaravati: ల్యాండ్ పూలింగ్‌కి భూములు.. రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

మరోవైపు ప్రయాణికులకు పారదర్శకమైన, నమ్మకమైన రైడ్ అనుభవాన్ని భారత్ ట్యాక్సీ అందించనుంది. ప్రైవేట్ యాప్‌లలో సాధారణంగా కనిపించే సర్జ్ ప్రైసింగ్‌ను తగ్గించటం లేదా పూర్తిగా నివారించటం దీని ప్రత్యేకత. రియల్–టైమ్ వాహన ట్రాకింగ్, ప్రయాణ వివరాలను కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకునే సదుపాయం, 24×7 కస్టమర్ కేర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్ల ధృవీకరణ ప్రక్రియ కఠినంగా ఉండనుండగా.. ఢిల్లీ పోలీస్ వంటి చట్ట అమలు సంస్థలతో సహకారం ఉండే అవకాశం ఉంది. డిజిలాకర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలతో అనుసంధానం ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరింత సులభం కానుంది.

రైడ్–హైలింగ్ రంగంలోకి ప్రభుత్వం ప్రత్యక్షంగా అడుగుపెట్టడం ఇదే తొలిసారి. డ్రైవర్ల ప్రయోజనాలు, ప్రయాణికుల సౌకర్యం రెండింటినీ సమతుల్యంగా చూసే ప్రయత్నంగా భారత్ ట్యాక్సీని అభివర్ణించవచ్చు. ఈ యాప్ విజయవంతమైతే, భారతదేశంలోని ట్యాక్సీ రంగంలో కీలక మార్పులు చోటుచుకునే అవకాశం ఉంది.

Exit mobile version