NTV Telugu Site icon

Shami: అప్పుడు షమీ రిటైర్మెంట్‌ ప్రకటించాలని చూశాడు: టీమిండియా మాజీ కోచ్

5

5

టీమిండియాలో ప్రస్తుతం కీలక పేసర్‌గా సేవలందిస్తున్నాడు మహ్మద్ షమీ. జస్ప్రీత్‌ బుమ్రా జట్టులోకి వచ్చే వరకూ షమీనే భారత జట్టు బౌలింగ్ దళాన్ని నడిపించాడు. ఇదే సమయంలో కుటుంబ సమస్యలతోపాటు ఫిట్‌నెస్‌, గాయాలు ఇబ్బంది పెట్టినా తన బౌలింగ్‌లో వాడి మాత్రం తగ్గలేదు. ఇలాంటి షమీ ఒకానొక దశలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేద్దామని భావించాడట. కానీ, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కలగజేసుకొని మద్దతుగా నిలవడంతో తన కెరీర్‌ను షమీ కొనసాగిస్తున్నాడని మాజీ బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్‌ వెల్లడించాడు.

Also Read: Womens T20 World Cup: విండీస్‌తో పోరుకు హర్మన్‌సేన రెడీ..మంధానా వచ్చేసింది!

“ఐదేళ్ల కిందట 2018లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించాం. అయితే షమీ అందులో విఫలమయ్యాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అప్పుడు నన్ను పిలిచి మాట్లాడాలని చెప్పాడు. నా గదికి రమ్మని ఆహ్వానించా. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డాడు. ఫిట్‌నెస్‌పరంగానూ ప్రభావితుడయ్యాడు. మానసికంగా కాస్త కుంగుబాటుకు గురైనట్లు అనిపించింది. ‘నాకు చాలా అసహనంగా, కోపంగా ఉంది. అందుకే నేను క్రికెట్‌ నుంచి వైదొలుగుదామని అనుకుంటున్నా’ అని షమీ నాతో చెప్పాడు. నేను వెంటనే అతడిని అప్పుడు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దగ్గరకు తీసుకెళ్లా. నాతో షమీ ఏం చెప్పాడో అదే మళ్లీ అతడికి చెప్పేశాడు.

Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదిగో..తొలి మ్యాచ్ వీరి మధ్యే!

‘మరి నువ్వేం చేస్తావు? బౌలింగ్‌ చేయడం తప్ప నీకేం తెలుసు..?’ అని మేం అన్నాం. ‘నువ్వు కోపంగా ఉండటంలో అర్థముంది. నీ చేతిలో బంతి ఉన్నప్పుడు ఇదే విధంగా ప్రవర్తించాలి. నువ్వు ఫిట్‌నెస్‌లో పూర్‌. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కోపాన్ని నీ శరీరంలో నుంచి తీసేయ్‌. నిన్ను ఎన్‌సీఏకు పంపుతాం. అక్కడే నాలుగు వారాలు ఉండు. ఇంటికి వెళ్లొద్దు’ అని రవిశాస్త్రి చెప్పడంతో షమీ ఎన్‌సీఏకి వెళ్లిపోయాడు. దాదాపు ఐదు వారాల తర్వాత వచ్చిన షమీ ‘సర్, నేను గుర్రం మాదిరిగా తిరిగి వచ్చా. ఇప్పుడు మీరు ఎంత దూరం పరుగెత్తమంటే అంత దూరం రన్‌ చేస్తా’ అని నమ్మకంగా చెప్పాడు. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడంతోనే ఇదంతా సాధ్యమైంది” అని భరత్‌ అరుణ్‌ గుర్తు చేసుకున్నాడు.

Also Read: Sania Mirza: ఆర్సీబీ మెంటర్‌గా సానియా..అందమంతా ఆ టీమ్‌లోనే!