Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..

Best Government Jobs

Best Government Jobs

Best Government Jobs in India: టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకెళ్తున్నా, మన దేశంలో యువత చూపు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఉంటోంది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగ భద్రత అని అందరూ అనుకుంటారు కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పటి తరం కేవలం సేఫ్టీ మాత్రమే చూడటం లేదు. మంచి జీతం, దానితో పాటు పుష్కలంగా దొరికే సెలవులు, బెటర్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కోరుకుంటున్నారు. మంచి శాలరీతో పాటు సరిపడా సెలవులు, మెడికల్ ఫెసిలిటీస్, ట్రావెల్ అలవెన్సులు లభిస్తే ఆ ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. అందుకే సంపాదనతో పాటు లీవ్స్, ఇతర బెనిఫిట్స్ బాగా వచ్చే కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగాలపై అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలవులు ఒకేలా ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకింగ్ రంగం, ఆర్‌బీఐ లాంటి రెగ్యులేటరీ సంస్థల్లో పనిచేసే అధికారులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. అలాంటి కొన్ని అగ్రశ్రేణి ఉద్యోగాలు, వాటిలోని ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

సెలవుల విషయానికి వస్తే అందరికంటే ముందు వరుసలో నిలిచేది బ్యాంకింగ్ రంగమే. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరితే లీవ్స్ విషయంలో తిరుగే ఉండదు. ఎస్‌బీఐ అధికారిక సమాచారం ప్రకారం.. పీఓలకు ప్రతి ఏటా 33 రోజుల ప్రివిలేజ్ లీవ్స్‌తో పాటు 12 రోజుల క్యాజువల్ లీవ్స్ లభిస్తాయి. ఇవి కాకుండా సిక్ లీవ్స్, ప్రసూతి సెలవులు కూడా ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మహిళా ఉద్యోగులు, లేదా పిల్లలు, వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలను చూసుకునే అర్హత కలిగిన సింగిల్ మేల్ ఎంప్లాయీస్‌కు ఏకంగా 2 సంవత్సరాల వరకు సాబేటికల్ లీవ్ ఇచ్చే సౌకర్యం కూడా ఎస్‌బీఐలో ఉంది. దీంతో పాటు లీవ్ ట్రావెల్ కన్సేషన్ (LTC) ఫెసిలిటీ కూడా పొందుతారు. ఇక జీతం విషయానికి వస్తే, ఎస్‌బీఐ తన కెరీర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ముంబై లాంటి మెట్రో సిటీలో ఒక పీఓ టోటల్ ప్యాకేజ్ (CTC) సుమారు రూ.18.67 లక్షల వరకు ఉంటుంది. ఇందులో లీజ్డ్ రెంటిల్ అకామిడేషన్, కాన్వెయన్స్ అలవెన్స్ లాంటివన్నీ కలిసి ఉంటాయి.

ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో గ్రేడ్-B ఆఫీసర్ పోస్టులకు ఉండే డిమాండే వేరు. ఇక్కడ జీతభత్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. 2025 నోటిఫికేషన్ ప్రకారం గ్రేడ్-B ఆఫీసర్ బేసిక్ పే నెలకు రూ.78,450గా ఉంది. హెచ్‌ఆర్‌ఏ కాకుండానే నెలకు ప్రారంభ గ్రోస్ జీతం సుమారు రూ.1,50,374 వరకు వస్తుంది. బ్యాంక్ క్వార్టర్స్, మెడికల్ సదుపాయాలు, లీవ్ ఫేర్ కన్సేషన్, ఫర్నిషింగ్ అలవెన్స్, తక్కువ వడ్డీకే రుణాలు వంటి అనేక సౌకర్యాలను ఆర్‌బీఐ అందిస్తుంది. సెలవుల విషయానికొస్తే.. ఆర్‌బీఐకి సొంత సర్వీస్ రూల్స్ ఉంటాయి. అందుకే నిర్దిష్ట సంఖ్యలో సెలవుల వివరాలు నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా చెప్పకపోయినా, బ్యాంక్ నిబంధనలకు లోబడి తగినన్ని లీవ్స్ పొందే అవకాశం ఉంటుంది.

ఇక కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-A, గ్రూప్-B కేడర్ ఉద్యోగులకు సీసీఎస్ (లీవ్) నిబంధనలు వర్తిస్తాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) నిబంధనల ప్రకారం ఇక్కడ అర్జెంట్ లీవ్స్, హాఫ్ పే లీవ్స్, క్యాజువల్ లీవ్స్‌తో పాటు పెంపకం కోసం చైల్డ్ కేర్ లీవ్స్ కూడా లభిస్తాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972 ప్రకారం అర్హులైన ఉద్యోగులు పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు. 2018లో చేసిన సవరణల ప్రకారం, చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నప్పుడు మొదటి 365 రోజులకు 100 శాతం పూర్తి జీతం, ఆ తర్వాత తీసుకునే 365 రోజులకు 80 శాతం జీతం చెల్లిస్తారు. ఇలా మంచి జీతంతో పాటు కుటుంబంతో గడపడానికి, సొంత అవసరాలకు సరిపడా సెలవులు ఇచ్చే ఉద్యోగాలు కాబట్టే యువత నేటికీ వీటి కోసం పోటీపడుతోంది.