Best Colors for Summer Clothes: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బయటకు అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, సరైన రంగు దుస్తులు ధరించడం కూడా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం, కొన్ని రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి వడదెబ్బ ప్రమాదం తగ్గుతుంది. వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగపడే మూడు ఉత్తమ రంగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుపు రంగు – వేసవికి బెస్ట్ ఎంపిక
వేసవిలో తెలుపు రంగు దుస్తులు ధరించడం అత్యుత్తమ ఎంపికగా భావిస్తారు. దీనికి ప్రధాన కారణం తెలుపు రంగు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబించడం. అంటే వేడిని గ్రహించకుండా బయటకు పంపిస్తుంది. తెల్లని దుస్తులు ధరించడం వల్ల ప్రత్యక్ష సూర్యకిరణాల ప్రభావం తగ్గి శరీరం చల్లగా ఉంటుంది. అందుకే వేసవిలో ఎక్కువ మంది తెలుపు రంగు కాటన్ దుస్తులను ఇష్టపడతారు.
పాస్టెల్ రంగులు కూడా చల్లదనానికే
తెలుపు రంగు కాకుండా లేత నీలం, పుదీనా ఆకుపచ్చ వంటి పాస్టెల్ రంగులు కూడా వేసవిలో మంచి ఎంపికలు. ఇవి ముదురు రంగులతో పోలిస్తే చాలా తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే ఈ రంగులు కళ్లకు కూడా చల్లదనాన్ని ఇస్తాయి. దీంతో మానసికంగా కూడా ప్రశాంతంగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అందుకే వేసవిలో లేత రంగుల దుస్తులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్రీమ్, బేజ్ రంగులు కూడా మంచి రక్షణ
లేత గోధుమరంగు, క్రీమ్ లేదా బేజ్ కలర్ దుస్తులు కూడా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రంగులు సూర్యుని పరారుణ కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ రంగులు స్టైలిష్, ప్రొఫెషనల్ లుక్ కూడా ఇస్తాయి. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో దుస్తులు ఎంపికలో గుర్తుంచుకోవాల్సినవి
* కాటన్ లేదా డ్రై-ఫిట్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి
* ముదురు రంగుల దుస్తులను వీలైనంత వరకు తగ్గించాలి
* వదులుగా ఉండే దుస్తులు ధరించాలి
* టోపీ, గొడుగు వంటి రక్షణ సాధనాలు ఉపయోగించాలి
* మధ్యాహ్నం సమయంలో బయట తిరగడం తగ్గించాలి
వేసవిలో సరైన దుస్తులు ఎంపిక చేసుకోవడం ద్వారా శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో వడదెబ్బ, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. అయితే, వేసవిలో బ్లాక్‌తో పాటు ముదురు రంగులకు పక్కన పెట్టడం ఉత్తమం అంటున్నారు..
