Bengaluru Weather Report: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అక్టోబర్ 16న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. న్యూజిలాండ్‌ను కూడా మట్టికరిపించాలని చూస్తోంది. చరిత్ర చూసినా, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసినా.. భారత్ తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత కొన్నేళ్లుగా సొంతగడ్డపై భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన కివీస్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
అయితే తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. బెంగళూరు నగరంలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అక్కడ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం నుంచి బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం అయితే కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందట. మ్యాచ్ మొదటి రెండు రోజుల్లో 40 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మూడో రోజు 67 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: IPL 2025 Auction: రోహిత్‌ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది కాబట్టి.. మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్షం ఆగిన 40 నిమిషాల్లో మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. భారత్‌లో ఈ మైదానమే బెస్ట్ డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇది అభిమానులకు ఊరట కలిగించే విషయమే. చూడాలి మరి వరణుడు ఏం చేస్తాడో. భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా.. భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.