బెంగళూరులో పట్టపగలు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అందరు చూస్తుండగానే రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కిందపడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. మహిళ అన్న విషయం మరిచి భౌతిక దాడికి తెగబడ్డారు ఓ షాపు యజమాని, సిబ్బంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని అవెన్యూ రోడ్‌లోని మియా సిల్క్ శారీస్ అనే దుకాణానికి హంపమ్మ అనే మహిళ వెళ్లి చీరలను దొంగిలించింది. అయితే ఈ తతంగం అంతా షాప్ లోని సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీలో, ఆ మహిళ దుకాణం లోపల నిలబడి చీరల కట్టను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తర్వాత ఆ మహిళ ప్యాక్ చేసిన కట్టను బయటకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. చీరల విలువ రూ.90,000 ఉంటుందని సమాచారం.
ఆ మహిళ మళ్ళీ అదే దుకాణానికి తిరిగి వచ్చి మరిన్ని చీరలు దొంగిలించిందని ఆరోపించగా.. ఈసారి దుకాణదారుడు ఆమెను గుర్తించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కోపంతో, దుకాణదారుడు ఆమెను రోడ్డుపైకి లాగి, పదే పదే చెంపదెబ్బ కొట్టడం, తన్నడం ప్రారంభించి, పోలీసులకు అప్పగించాడు. సమీపంలో నిలబడి ఉన్న దుకాణదారులు, స్థానికులు ఈ సంఘటన మొత్తాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. దొంగతనం కేసులో మహిళపై ఒకటి, దాడి కేసులో దుకాణదారుడు, అతని సహాయకుడిపై మరొకటి రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు.
