Indore: ఇండోర్ నగరంలో ఇటీవల ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఊహించని నిజాన్ని బయటకు తీసుకొచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, వారికి జీవనోపాధి మార్గాలు చూపించాలనే ఉద్దేశంతో “భిక్షాటన రహిత ఇండోర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. కానీ ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి కథ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సరాఫా బజార్ ప్రాంతంలో మంగీలాల్ అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా భిక్ష అడుగుతూ కనిపించేవాడు. ఆయనకు శారీరక వైకల్యం ఉండటంతో చేతులతో నేలను తోసుకుంటూ లేదా ఒక చిన్న బండిపై కూర్చుని తిరుగుతూ ఉండేవాడు. దాన్ని చూసిన ప్రజలు జాలి పడి రోజూ డబ్బులు ఇస్తుండేవారు. కొన్నిరోజుల్లో అయితే రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వచ్చేవని చెబుతున్నారు.
తాజాగా నిర్వహించిన “బెగ్గర్-ఫ్రీ ఇండోర్”లో భాగంగా అధికారులు మంగీలాల్‌ను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడే అసలు నిజం బయటపడింది. మంగీలాల్ అసలు పేదవాడు కాదని తెలిసింది. అతనికి ఇండోర్‌లోనే మూడు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒకటి బహుళ అంతస్తుల భవనం. ఇంకొకటి సుమారు 600 చదరపు అడుగుల ఇల్లు. అంతేకాదు, అతని వద్ద మూడు ఆటోరిక్షాలు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఉన్నాయి. వాటిని అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నాడు.
ఇదే కాదు, ప్రభుత్వ పథకమైన పీఎంఏవై కింద పేదల కోసం ఇచ్చే ఒక బెడ్‌రూమ్ ఇంటిని కూడా మంగీలాల్ పొందాడు. అప్పటికే అతనికి ఇళ్లు ఉన్నా, ఆ ఇంటి లాభం ఎలా పొందాడనే విషయంపై అధికారులు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. మంగీలాల్ సరాఫా బజార్‌లోని చిన్న వ్యాపారులకు అప్పులు ఇచ్చేవాడట. వారినుంచి క్రమంగా వడ్డీ కూడా వసూలు చేసేవాడని విచారణలో తెలిసింది. ఎక్కువ వడ్డీ వసూలు చేయడం చట్టవిరుద్ధం కావడంతో, ఈ అంశాన్ని కూడా అధికారులు గమనిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అతడి బ్యాంకు ఖాతాలు, ఆదాయ మార్గాలు, ఆస్తుల వివరాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. నిజంగా అతని దగ్గర ఎంత ఆస్తి ఉందో లెక్క కడుతున్నారు.
