NTV Telugu Site icon

BCCI: సీనియర్‌ మెన్స్‌ సెలక్షన్‌ కమిటీని తొలగించిన బీసీసీఐ.. తాజాగా దరఖాస్తులకు ఆహ్వానం

Bcci

Bcci

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం సీనియర్ పురుషుల జట్టు కోసం నేషనల్ సెలక్టర్ల స్థానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉందని బీసీసీఐ తెలిపింది. భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసింది. కమిటీలోని ఇతర సభ్యులు సునీల్ జోషి (సౌత్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), దేబాశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) ఉన్నారు. ఐదుగురు సెలక్టర్ల స్థానాలకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

గత నెలలో ముంబైలో జరిగిన బోర్డు ఏజీఎం తర్వాత బీసీసీఐ సెక్రటరీ జే షా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సెలెక్టర్ల నియామక ప్రక్రియను పర్యవేక్షించే క్రికెట్ సలహా కమిటీ (CAC) ఏర్పడుతుందని కూడా ఆయన తెలిపారు. ఒక సంవత్సరం తర్వాత సీఏసీ అభ్యర్థులను సమీక్షిస్తుందని, వారి పనితీరుపై బోర్డుకు అభిప్రాయాన్ని అందజేస్తుందని షా చెప్పారు. టీ20 ప్రపంచ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమణ తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

HIV Positive: ఆ జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌.. 35 మందికి టీబీ..

అబే కురువిల్లా తన పదవీకాలం పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 2022 నుంచి వెస్ట్ జోన్ సెలెక్టర్ స్థానం ఖాళీగా ఉండగా, ఈస్ట్ జోన్‌కు చెందిన దేబాశిష్ మొహంతి గతంలో జూనియర్ జట్టు సెలక్షన్ కమిటీ సభ్యునిగా పనిచేసినందున అతని పదవీకాలం కూడా త్వరలో ముగియనుంది. కొత్త సెలక్షన్ కమిటీ డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టనుంది. సెలెక్టర్‌ స్థానం కోసం అభ్యర్థులు పలు ప్రమాణాలను కలిగి ఉండాలని బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ జాతీయ సెలక్టర్ల (సీనియర్ మెన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోందని ఆ ప్రకటనలో వెల్లడించడం గమనార్హం. సెలెక్టర్‌ స్థానం కోసం అభ్యర్థులు కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డే, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలని అందులో ప్రకటించారు. అలాగే, అభ్యర్థులు కనీసం ఐదు సంవత్సరాల క్రితం ఆట నుండి రిటైర్ అయి ఉండాలి.