BCCI New Rules: దేశీయ క్రికెట్‌లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!

Bcci

Bcci

BCCI New Rules: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2026-27 దేశీయ సీజన్‌కు సంబంధించి పలు కీలక నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రతిపాదించిన కొత్త క్రికెట్ చట్టాలను బీసీసీఐ దేశీయ టోర్నీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఇతర దేశీయ టోర్నీల్లో అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి.

రోజు చివరి ఓవర్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే:

కొత్త నిబంధనల ప్రకారం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రోజు చివరి ఓవర్‌ను పూర్తిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చివరి ఓవర్‌లో వికెట్ పడితే అంపైర్లు ఆటను ముగించే అవకాశం ఉండేది. అయితే ఇకపై చివరి ఓవర్‌లో వికెట్ పడినా, మిగిలిన బంతులు తప్పనిసరిగా వేయాల్సిందే. దీంతో కొత్త బ్యాటర్ కూడా ఆ రోజు మిగిలిన బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త బ్యాటర్‌ను పంపకుండా సమయం వృథా చేసే అవకాశాన్ని నివారించేందుకే ఈ మార్పును తీసుకొచ్చారు.

ఉద్దేశపూర్వక నోబాల్ వేస్తే..

ఈ కీలక మార్పు బౌలర్లకు సంబంధించినది. ఎవరైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ లేదా పిచ్‌పై పడకుండా డెలివరీ వేస్తే, ఇకపై ఆ ఇన్నింగ్స్‌కే కాకుండా మొత్తం మ్యాచ్‌లో బౌలింగ్ చేసే హక్కును కోల్పోతాడు. అయితే అది ఉద్దేశపూర్వకమా.? కాదా.? అన్నది అంపైర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

ఫీల్డర్ ముందే బంతిని అడ్డుకుంటే?

స్ట్రైకర్‌కు చేరకముందే ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే, దానిని ఇకపై నోబాల్ తో పాటు డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అలాగే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో డిక్లరేషన్ లేదా ఫోర్‌ఫిట్ చేసే అవకాశాన్ని కూడా తొలగించారు.

డ్రింక్స్ బ్రేక్‌లో హెడ్ కోచ్‌కు అనుమతి:

వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌కు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీంతో జట్టు వ్యూహాలను మ్యాచ్ మధ్యలో మరింత సమర్థంగా చర్చించే అవకాశం లభించనుంది.

డెలిబరేట్ షార్ట్ రన్‌:

బ్యాటర్లు ప్రత్యర్థిని మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా పరుగు మధ్యలో తిరిగి వెనక్కి వచ్చినా దానిని డెలిబరేట్ షార్ట్ రన్‌గా పరిగణించరు. అయితే ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసుకుంటే.. తదుపరి బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలో నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు ఉంటుంది.

డెడ్ బాల్ రూల్‌:

ఇప్పటివరకు బంతి బౌలర్ లేదా వికెట్ కీపర్ చేతిలోకి వచ్చిన తర్వాతే సాధారణంగా డెడ్ బాల్‌గా పరిగణించేవారు. ఇకపై బంతి ఏ ఫీల్డర్ చేతిలో స్థిరంగా ఉన్నా లేదా మైదానంలో పూర్తిగా నిలిచిపోయినా దానిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు.

వైడ్, బౌండరీ, వికెట్‌కీపర్‌పై కొత్త మార్పులు:

వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో లెగ్‌సైడ్ వైడ్‌కు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. బంతి విసిరే క్షణంలో ఫీల్డర్లందరూ తప్పనిసరిగా బౌండరీ లైన్ లోపలే ఉండాలి. దీంతో బౌండరీ బయట నిలబడి ప్రయోజనం పొందే అవకాశానికి చెక్ పడనుంది. ఇంకా వికెట్‌కీపర్ కూడా బంతి డెలివరీ సమయంలో వికెట్ వెనుకనే ఉండాలి. అయితే బౌలర్ రన్‌అప్ సమయంలో కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ ముందుకు వచ్చినా ఇకపై శిక్ష విధించరు.

పరికరాల వినియోగం:

మ్యాచ్‌లో ఎవరైనా అక్రమ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే.. అంపైర్లు వాటి వినియోగాన్ని వెంటనే ఆపడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదించాల్సి ఉంటుంది.

దేశీయ సీజన్‌లోనే అమలు:

ఈ ప్రతిపాదిత నిబంధనలను బీసీసీఐ 2026-27 దేశీయ సీజన్ నుంచే అమలు చేయాలని భావిస్తోంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి ప్రధాన దేశీయ టోర్నీల్లో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆటను మరింత న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశ్యంగా బీసీసీఐ, ఎంసీసీ తెలిపాయి.