NTV Telugu Site icon

Team India Head Coach: హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు.. అర్హతలు ఇవే!

Bcci

Bcci

BCCI invites applications for the position of Team India Head Coach: టీమిండియా మెన్స్ సీనియర్ హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారు మే 27న సాయంత్రం 6 గంటల లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్‌లో తమ డీటెయిల్స్ సమర్పించాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. దరఖాస్తుల సమగ్ర సమీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

హెడ్ కోచ్ ప‌ద‌వీకాలం మూడున్నర సంవత్సరాలు (2024 జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు) ఉంటుంద‌ని బీసీసీఐ పేర్కొంది. నూతన కోచ్ 2027 వ‌న్డే ప్రపంచ‌క‌ప్ వ‌ర‌కు కొన‌సాగుతాడు. కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బ‌ట్టి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా కొన‌సాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. జట్టు ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత అని బీసీసీఐ పేర్కొంది.

కోచ్‌ అర్హతలు:
# కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు (లేదా)
# టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం (లేదా)
# ఐపీఎల్‌/ ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్టు/జాతీయ ఏ జ‌ట్ల‌కు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసిన అనుభవం (లేదా)
# బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ తప్పనిసరి