NTV Telugu Site icon

B. C. Janardhan Reddy: బనగానపల్లె చిరు వ్యాపారులకు అండగా బీసీ జనార్థన్ రెడ్డి.. తొలి విడతగా 140 తోపుడు బండ్ల పంపిణీ..!

Bc

Bc

ఆయనకు ప్రజలంటే ప్రాణం.. తనను నమ్ముకున్న ప్రజల కోసం తన సొంత ఆస్తులు ఖర్చు అయినా పర్లేదు.. వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకునే పెద్ద మనసు అయినది. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయాలకు వచ్చి.. అవినీతి, అక్రమాలతో వందల కోట్లు దోపిడీకి పాల్పడుతూ.. తరతరాలకు సరిపడా సంపాదించుకునే నాయకులు ఉన్న కాలంలో, పదవుల్లో ఉన్నా లేకపోయినా.. కష్టపడి సంపాదించిన వందల కోట్లను సేవాకార్యక్రమాలకు ‌ఖర్చుపెడుతున్న నిస్వార్థ ప్రజాసేవకుడు బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో రాజకీయాలకతీతంగా ప్రజాభిమానం సంపాదించుకున్న బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి.. తాజాగా చిరువ్యాపారులకు చేసిన సాయంతో సేవాగుణంలో తనకు సాటెవ్వరు లేరని మరోసారి నిరూపించుకున్నారు.

నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం.. బనగానపల్లె. నిత్యం కరువు కాటకాలతో దుర్భిక్షం తాండవించే ఈ ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలే ఎక్కువ. పొట్టకూటి కోసం తోపుడుబండ్లపై కూరగాయలు, పండ్లు, తినుబండారాలు అమ్ముకుంటూ చాలీ చాలని సంపాదనతో బతుకు బండిని లాగించే బడుగు జీవులు అధికంగా ఉన్న ప్రాంతం ఇది. తోపుడు బండిపై ఏదో ఒకటి అమ్ముకుని జీవనం సాగిద్దామన్నా.. సొంతంగా తోపుడు బండి కొనుక్కోలేని దుస్థితి. రోజుకు 50 – 70 రూపాయలకు తోపుడు బండిని రోజువారీ అద్దెకు తీసుకోవాల్సిందే.. అంటే నెలకు 1500 నుంచి 2 వేల రూపాయలు, సంవత్సరానికి రూ. 18 నుంచి 20 వేలు వేలు కేవలం తోపుడు బండి అద్దెకు పెట్టాల్సిందే. ఒక్క బనగానపల్లె పట్టణంలోనే వందలాదిగా తోపుడు బండ్లపై జీవనం సాగించేవాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలీ చాలని సంపాదనతో దినసరి ఖర్చులు, బండి కిరాయికి పోను నాలుగు రూపాయలు వెనకేసుకోలేని పరిస్థితి. ఒక్కోసారి వ్యాపారం లేక బండి కిరాయి కట్టలేక, పస్తులుండాల్సిన దారుణమైన పరిస్థితిని చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. తన నియోజకవర్గంలో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి చలించిపోయారు. వారికి కనీసం అద్దె భారం అయినా తొలగించాలనే ఆలోచనతో సొంత నిధులతో ఉచితంగా తోపుడు బండ్లను చిరువ్యాపాలకు అందించాలని భావించారు. అనుకున్నదే తడవుగా బనగానపల్లె తెలుగుదేశం కార్యాలయంలో తొలివిడతగా 140 తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు పంపిణీ చేశారు. బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. చాలీ చాలని సంపాదనతో, అద్దె భారంతో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో మొదట విడతగా 140 తోపుడు బండ్లు పంపిణి చేయటం జరిగిందని, త్వరలోనే ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు ప్రతి చిరువ్యాపారికి ఉచితంగా తోపుడు బండ్లను అందించి వారికి అద్దె భారం తొలగిస్తానని ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి ప్రకటించారు.

బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా తోపుడు బండ్లను అందుకున్న చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. తోపుడు బండికి అద్దె రోజుకు 50 పైనే కడుతున్నాము, నెలకు దాదాపు 2000 రూపాయల వరకు తోపుడు బండి అద్దె కట్టి కుటుంబ జీవనం సాగించాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఒక రోజు వ్యాపారం జరుగుతుంది, ఒక రోజు వ్యాపారం జరగదు.. అలాంటి పరిస్థితులలో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా ఇబ్బందిగా ఉండేంది కానీ.. బీసీ జనార్దన్ రెడ్డి మా గురించి అలోచించి ఉచింతంగా తోపుడు బండి ఇచ్చి మా కుటుంబాలకు ఎంతో మేలు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా అధికారంలో లేకపోయినా.. పదవుల్లో ఉన్నా లేకున్నా… చిరువ్యాపారులకు ఉచితంగా తోపుడు బండ్లను అందించి, వారి జీవితాలకు భరోసాగా నిలిచి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్న అభినవ కర్ణుడు బీసీ జనార్ధన్ రెడ్డిపై బనగానపల్లె ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.