తెలంగాణ పూల సంబురం విశ్వవ్యాప్తమైంది. మన సాంస్కృతిక వైభవం ఖండాంతరాలు దాటింది. పూల పండుగను చూసి ప్రపంచమే అబ్బురపడింది. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనాన్ని చూసి మరోసారి ప్రపంచం దృష్టి తెలంగాణపై పడింది.ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
ఈ రోజు సాయంత్రం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బూర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటాన్ని సైతం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై ప్రదర్శించారు.
రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బూర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు కవిత. ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీపా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
