బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే మేటి ఒకడిగా పేరు తెచ్చుకున్న వెటరన్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా సోషల్ మీడియా వేదికగా తాను రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. దాంతో బంగ్లాదేశ్ క్రికెట్ స్వర్ణ తరం ఐదుగురు పాండవులు ఆటకు దూరమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన తర్వాత ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. మష్రఫే మోర్తాజా, తమీమ్ ఇక్బాల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కాగా.. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగా షకీబ్ అల్ హసన్ ఆడలేకపోతున్నాడు.
ప్రతిదీ పరిపూర్ణంగా ముగియదు అని మహ్మదుల్లా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. బంగ్లాదేశ్ టీమ్ సహచరులు, కోచ్‌లు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు. అందరూ నాకు మద్దతుగా నిలిచారు. నా తల్లిదండ్రులు, ముఖ్యంగా నా మామ, సోదరుడికి పెద్ద ధన్యవాదాలు. నా సోదరుడు ఎమ్దాద్ ఉల్లా చిన్నతనం నుండి నా కోచ్ అండ్ మెంటర్‌గా నిరంతరం నాకు తోడుగా ఉన్నాడు’ అని మహ్మదుల్లా రాసుకొచ్చాడు. గత ఫిబ్రవరిలోనే సెంట్రల్ కాంట్రాక్టుకు తనను పరిగణించవద్దని మహ్మదుల్లా బంగ్లాదేశ్ బోర్డును అభ్యర్థించాడు.
మహ్మదుల్లా 17 ఏళ్ల కెరీర్‌లో బంగ్లాదేశ్ తరఫున 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 36.46 సగటుతో 5689 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 33.49 సగటుతో 2914 పరుగులు, టీ20ల్లో 23.50 సగటుతో 2444 పరుగులు చేశాడు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేసిన మహ్మదుల్లా.. వన్డేల్లో 82, టెస్టుల్లో 43, టీ20ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ జట్టుకు 43 టీ20 మ్యాచ్‌లు, ఆరు టెస్టుల్లో సారథిగా వ్యవహరించాడు. 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేతో మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 24న రావల్పిండిలో న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు.