Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!

Shadman Islam

Shadman Islam

Shadman Islam: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం చీలమండ గాయంతో మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై మైదానం వెలుపలకు తీసుకెళ్లారు. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అమీర్ జాంగూ బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాద్‌మన్ బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. అయితే బంతిని అందుకునే ప్రయత్నంలో జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చీలమండకు గాయమైంది. రీప్లేల్లో ఔట్‌ఫీల్డ్‌లో మంచు ఉండటంతోనే అతడు జారిపడినట్లు కనిపించింది.

షాద్‌మన్ గాయంపై బంగ్లాదేశ్ ఫిజియో బాయ్జెదుల్ ఇస్లాం ఖాన్ స్పందించాడు. అతడి ఎడమ చీలమండ మెలిక పడిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయించనున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన షాద్‌మన్ ఈ మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్‌కు వస్తాడా..? లేదా.? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ అతడు మ్యాచ్‌కు దూరమైతే, మిగిలిన ఆటను బంగ్లాదేశ్ పది మంది ఆటగాళ్లతోనే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ తొలి రోజు వెస్టిండీస్ 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆటను నిర్ణీత సమయానికి ముందుగానే నిలిపివేశారు. రెండో రోజు ఆట ప్రారంభంలోనే షాద్‌మన్ గాయపడటం బంగ్లాదేశ్ శిబిరంలో ఆందోళన కలిగించింది. ప్రస్తుతం వెస్టిండీస్‌ 322/8 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది.