AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..

Bangladesh

Bangladesh

ఢాకాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ తొలిసారిగా ద్విపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2005లో కార్డిఫ్‌లో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ తొలిసారి ఓడించగా, మళ్లీ ఇప్పుడు సిరీస్ గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ పోరాటం
బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన బంతి మిరాజ్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దెబ్బ తీవ్రతకు ఆయనకు మైదానంలోనే వాంతులు అయ్యాయి. ఫిజియోలు మైదానంలోకి వచ్చి చికిత్స అందించారు, స్ట్రెచర్ కూడా సిద్ధం చేశారు. అయినప్పటికీ, మిరాజ్ మైదానాన్ని వీడకుండా పోరాడి, 22 బంతుల్లో 22 పరుగులు చేశారు. 35వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

×
×
Ad

ఆసుపత్రిలో చేరిక..
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ మిరాజ్ మైదానం నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంతి తగలడం వల్ల ఆయన తలకి గాయం అయిందని జట్టు ఫిజియో తెలిపారు. తదుపరి పరీక్షలు, పర్యవేక్షణ కోసం ఆయనను 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంచినట్లు, ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు పేర్కొన్నారు.