Site icon NTV Telugu

Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్.. పొరుగు దేశానికి ఏమైంది..!

Bangladesh Crisis

Bangladesh Crisis

Bangladesh: భారత దేశానికి పొరుగున ఉన్న దేశం బంగ్లాదేశ్. ఒకప్పుడు ఈ దేశానికి పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండియా బాసటగా కూడా నిలిచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ పొరుగు దేశం పాకిస్థాన్ బాటలో పయనిస్తుంది. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగి ఏడాది గడిచింది. అయినప్పటికీ ఈ దేశం పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. షేక్ హసీనా హయాంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడటానికి ఆ దేశ ఆర్థిక సలహాదారులు అంతర్జాతీయ సంస్థల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.. అసలు ఏమైంది బంగ్లాదేశ్‌కు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: A Masterpiece: త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ పెడుతూ “ఎ మాస్టర్ పీస్”!

IMF నుంచి రుణం కోసం ఎదురు చూపులు..
పాకిస్థాన్ లాగే బంగ్లాదేశ్ కూడా IMF నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకార సంస్థల నుంచి ఆశించిన మొత్తంలో డబ్బు అందడం లేదని ఆర్థిక సలహాదారు డాక్టర్ సలావుద్దీన్ అహ్మద్ అన్నారు. “కనీసం $30 బిలియన్లు అవసరం. బదులుగా, ప్రభుత్వం IMF నుంచి కేవలం ఒకటి నుంచి ఒకటిన్నర బిలియన్ డాలర్లు పొందడానికే ఇబ్బంది పడుతోంది” అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ 2022లో IMFతో $4.7 బిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2024 వరకు మూడు విడతలుగా బంగ్లాదేశ్ $2.31 బిలియన్లను అందుకుంది. అయితే షరతులు నెరవేర్చకపోవడంతో గత ఏడాది డిసెంబర్‌లో IMF నాల్గవ విడత నిధులు విడుదల చేయలేదు. తరువాత వివాదాలు పరిష్కారం అవ్వడంతో.. ఈ ఏడాది జూన్‌లో IMF నాల్గవ, ఐదవ విడతలుగా $1.33 బిలియన్లను విడుదల చేసింది.

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్..
ఢాకాలోని అగర్గావ్‌లోని పికెఎస్‌ఎఫ్ భవన్‌లో వాతావరణ శిక్షణ వర్క్‌షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ దేశ ఆర్థిక సలహాదారు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ప్రస్తుతం వాతావరణ సంక్షోభంతో సతమతమతోందని అన్నారు. దేశంలో వేడి పెరుగుతోందని, నదులు, సముద్రాల నీటి మట్టం కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్‌కు దాదాపు 30 బిలియన్ డాలర్లు అవసరం అని ఆయన అన్నారు. ఒకటిన్నర సంవత్సరాలలో 5 బిలియన్ డాలర్ల కోసం దేశం చర్చలు జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల సహకారంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

2024 జూలై నెలలో బంగ్లాదేశ్‌లో ఒక సామూహిక తిరుగుబాటు జరిగింది. ఇది విద్యార్థుల నిరసనలతో మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాల విధానంలో వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటు, హింసాత్మక ఘర్షణలకు దారితీసి, చివరికి నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లేలా చేసిన విషయం తెలిసిందే.

READ ALSO: PPF Scheme: పోస్టాఫీస్‌లో బంఫర్ స్కీమ్‌.. 12,500తో రూ.40 లక్షలు..

Exit mobile version