Banda Prakash : తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకాశ్ ఎన్నిక గురించి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు.
Read Also: CM KCR: ప్రతి డివిజన్‌లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
అంతకు ముందు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ పదవీకాలం 2012, జూన్ 3న పూర్తైంది. అప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు బండా ప్రకాశ్ శనివారం నామినేషన్ వేశారు. ఆదివారం బండ ప్రకాశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండా ప్రకాశ్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఎంపీగా ఆరేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.