Site icon NTV Telugu

Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా

Banana Price Hike

Banana Price Hike

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో అరటి ధరలకు రెక్కలు వచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వంటి ప్రభావాలతో ఇక్కడ ఎన్నడూ లేనంత రీతిలో అరటి గెలల ధరలు పలుకుతున్నాయి. ఆయా రకాన్ని బట్టి ఆరు గెలల అరటి లోడుకు రూ.1200 నుండి రూ.4000 రూపాయలు వరకు రైతులకు ధర లభిస్తోంది. అరటి ధరలకు రెక్కలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సీజన్లో ముహుర్తాలు అధికంగా ఉండటంతో మరో ఐదు నెలల పాటు గిట్టుబాటు ధరలకు డోకా ఉండదని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. జూన్ 8 వరకూ వివాహ ముహుర్తాలు ఉన్నాయి. మళ్లీ కొద్ది గ్యాప్ తర్వాత ముహుర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. దీంతో ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గత కొన్ని నెలలుగా కలిగిన నష్టాల నుండి గట్టెక్కి లాభాలు పొందవచ్చని అరటి రైతులు ఆశపడుతున్నారు.

మరోవైపు అరటి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ఇటీవలి రోజుల్లో అకాల వర్షాలకు చాలా ఎకరాల్లో పంట దెబ్బతింది. ఈ అన్నింటి ప్రభావాలతో రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో అరటి పంటకు ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలుకుతోంది. దీంతో ప్రస్తుతం అరటి తోటలు వేసిన రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

Exit mobile version