Pakistan-BLA: బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ ఆపరేషన్లలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు, అలాగే మూడు మంది BLA కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సంస్థ వెల్లడించింది. పంజ్గూర్‌లో ప్రభుత్వ భవనాలను ఆక్రమించామని, రేకో డిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వాహనాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని BLA పేర్కొంది.
Winter Tea Benefits: రోజూ టీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..
BLA ప్రతినిధి జైద్ బలూచ్ తెలిపిన వివరాల ప్రకారం.. సున్నీ, క్వెట్టా, కేచ్, పంజ్గూర్, బులేదా ప్రాంతాల్లో విడివిడిగా జరిగిన దాడుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో ఆయుధాలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాలపై నియంత్రణ కూడా సాధించినట్లు ఆయన చెప్పారు. వేర్వేరు ఎదురుకాల్పుల్లో ముగ్గురు BLA కమాండర్లు మరణించినట్లు వెల్లడించారు. సమాచారం మేర BLA కమాండర్లు పంజ్గూర్ పట్టణంలోని ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకుని, నగరంలోని పలు ప్రాంతాల్లో మోహరించారు. ఈ చర్యలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం.
కలాత్ మిడ్‌వే వద్ద రేకో డిక్ ఖనిజ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వాహనాల కాన్వాయ్‌ను BLA లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో మూడు వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలిపింది. కాన్వాయ్‌కు భద్రత కల్పిస్తున్న పాకిస్తాన్ సైనికులకు కూడా నష్టం జరిగినట్లు పేర్కొంది. ఎదురుకాల్పుల్లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD)కు చెందిన ఒక అధికారి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు BLA వర్గాలు వెల్లడించాయి. సుమారు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో నియంత్రణ కొనసాగించిన అనంతరం, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం తమ బలగాలు సురక్షితంగా వెనుదిరిగాయని తెలిపింది.
డిసెంబర్ 13న బులేదా ప్రాంతంలోని మినాజ్ ఏరియాలో పాకిస్తాన్ సైన్యానికి రేషన్ తీసుకెళ్తున్న వాహనాలను BLA తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. డ్రైవర్లను హెచ్చరించి వదిలిపెట్టామని, అయితే ఆక్రమణలో ఉన్న సైన్యానికి రేషన్ లేదా ఇతర సరుకులు సరఫరా చేయడం ప్రత్యక్షంగా సహకరించినట్లేనని హెచ్చరించారు. ఈ విధమైన కార్యకలాపాల్లో పాల్గొనే వారిని లక్ష్యంగా చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి దీనిపై అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
