Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!

Balkampet Yellamma

Balkampet Yellamma

Balkampet Yellamma Kalyanam: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసం తొలి మంగళవారం నిర్వహించే ఈ పవిత్ర వేడుకకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయం, కళ్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించగా.. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఉదయం 3 గంటల నుంచే అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఉదయం 10 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 11.59 గంటలకు అమ్మవారి దివ్య కళ్యాణం ముహూర్తం నిర్వహించారు.

ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తె హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా కళ్యాణ మహోత్సవానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.

బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. సోమవారం పెళ్లికూతురు, ఎదుర్కోలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా.. మంగళవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బుధవారం రథోత్సవం వైభవంగా జరగనుంది. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు కల్పించారు. మొత్తం 7 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, కళ్యాణాన్ని ప్రతి భక్తుడు వీక్షించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు నిరంతరం అన్నదానం నిర్వహిస్తున్నారు. తాగునీటి శిబిరాలు, 6 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. జోగినీలు, శివశక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక దర్శన సమయం కేటాయించారు.

గత ఏడాది కళ్యాణ మహోత్సవానికి సుమారు 7 లక్షల మంది భక్తులు హాజరుకాగా.. ఈసారి అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దాదాపు 700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 36 రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు 130 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తూ.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు కళ్యాణ మహోత్సవం కోసం 150 ప్రత్యేక పాసులను జారీ చేశారు. ఒక్కో పాస్ ధర రూ.3,000గా నిర్ణయించగా.. ప్రత్యేక వీఐపీ పాసులను రూ.8,000కు అందుబాటులో ఉంచారు. మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం, ఆలయ యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేసింది.