Site icon NTV Telugu

Cancer Survey: బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవు.. తేల్చిన వైద్య ఆరోగ్య శాఖ!

Balabhadrapuram

Balabhadrapuram

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అక్కడి జనాలకు సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేల్చింది. రోగులకు సంబంధిత వైద్య నిపుణుల మార్గదర్శకంతో మందులు పంపిణీ జరుగుతోంది. మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. అయితే రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో ఉన్న మహిళకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

క్యాన్సర్‌ మహమ్మారి విజృంభిస్తున్న బలభద్రపురం గ్రామంలో వైద్య బృందాలు శనివారం జల్లెడ పట్టాయి. పలువురు వైద్యాధికారులు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 93 మంది సిబ్బందితో కూడిన 31 బృందాలు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తూ.. పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 38 మందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. 9 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. వీరిలో ఎముకల సమస్యలతో ఇద్దరు.. గైనిక సమస్యలతో ఇద్దరు.. లివర్, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన రక్తహీనతలతో ఒక్కొక్కరు బాధపడుతున్నట్లు తేలింది.

రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో ఉన్న మహిళకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇతర రోగులకు సంబంధిత వైద్య నిపుణుల మార్గదర్శకంతో మందుల పంపిణీ జరుగుతోంది. మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు అధికారులకు సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులైన ఏడుగురి నుంచి సేకరించిన నమూనాలపై నివేదికల కోసం వైద్యులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ రోగులపై వైద్య ఆరోగ్యశాఖ క్రమంగా పర్యవేక్షణ చేస్తోంది.

Exit mobile version