Hyderabad: మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు..

Murder

Murder

Hyderabad: హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు గంటల వ్యవధిలోనే భగ్నం చేశారు. ఈ కుట్రకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.. వివరాల్లోకి వెళితే, బోరబండకు చెందిన ఇమ్రాన్ తన సోదరుడు ఫయాజ్‌తో కలిసి బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు నెల రోజుల క్రితమే పథకం రచించాడు. ఇందులో భాగంగా నెల రోజుల క్రితం బోరబండకు చెందిన మిస్బాను సంప్రదించి, హత్య చేసేందుకు రూ. 25 లక్షల సుపారీ ఆఫర్ చేశాడు. ఇందుకు అంగీకరించిన సుపారీ గ్యాంగ్ రూ. 5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది.

ఆ తర్వాత నిందితులు మారణాయుధాలతో బాబా ఫసియుద్దీన్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని గుర్తించిన బాబా ఫసియుద్దీన్ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను గుర్తించారు. వీరిలో ఇమ్రాన్ ఖాన్, దేవర రాజా, ఫయాజ్ ఖాన్ సహా ఐదుగురిని అరెస్ట్ చేయగా, సయ్యద్ హాదీ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, కుట్రకు ఉపయోగించిన ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మరోవైపు, బాధితుడు బాబా ఫసియుద్దీన్‌కు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు.