Michael Vaughan Hails India Team after Pakistan Defeat vs Australia: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్ 271 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్లకు అనుకూలంగా ఉండే పెర్త్ పిచ్‌పై ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు. దాంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను ఓడించే సత్తా కేవలం భారత్‌కు మాత్రమే ఉందని మైఖేల్ వాన్ అన్నాడు. ‘పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ 500 వికెట్ల క్లబ్‌లోకి చేరడం అభినందనీయం. అయితే బలమైన ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించే సత్తా టీమిండియాకు మాత్రమే ఉంది. బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోంది’అని ఎక్స్‌లో వాన్ పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రహదారులు!
ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ చివరిసారిగా 1995లో టెస్టు మ్యాచ్‌లో గెలిచింది. 1999 నుంచి వరుసగా 15 టెస్టుల్లో ఓటమిపాలైంది. 24 ఏళ్ల నుంచి కనీసం ఒక్క మ్యాచ్‌ను కూడా డ్రాగా ముగించలేకపోయింది. మరోవైపు సొంతగడ్డపై ఆస్ట్రేలియా చివరి 35 టెస్టుల్లో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఆ నాలుగు టెస్టుల్లో భారత్ చేతిలోనే ఓడింది. అయిదు టెస్టులు ఆస్ట్రేలియా డ్రాగా ముగించగా.. అందులో భారత్‌తో ఆడినవి రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మూడు టెస్టుల్లో రెండు ఇంగ్లండ్‌తో, ఒకటి దక్షిణాఫ్రికాతో డ్రా చేసుకుంది.