NTV Telugu Site icon

AUS vs IND: సచిన్‌ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!

Sachin Ec

Sachin Ec

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ గడ్డకు చేరుకుని సాధన కూడా షురూ చేసింది. గత రెండు పర్యాయాలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించిన భారత్.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పెద్దగా ఫామ్‌లో లేకపోవడం జట్టుకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ ఇద్దరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.

రోహిత్ శర్మ అడపాదడపా ఆడుతున్నా.. విరాట్ కోహ్లీ మాత్రం ఇటీవల చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. విరాట్ ఒక్క మంచి ఇన్నింగ్స్‌ ఆడితే చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో బ్యాటింగ్‌ పాఠాలు చెప్పించాలని భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐకి సూచించాడు. ఈ సిరీస్ కోసం కన్సల్టెంట్‌గా సచిన్‌ను నియమించుకోవాలన్నాడు. ఈ రోజుల్లో కన్సల్టెంట్‌ల నియామకం సర్వసాధారణం అని రామన్ పేర్కొన్నాడు.

Also Read: Rohit Sharma: అందరి తండ్రుల మాదిరిగానే రోహిత్!

‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత్‌ జట్టు ఆస్ట్రేలియాలో ఉంది. టీమిండియాకు ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సేవలను బీసీసీఐ వినియోగించుకోవాలి. ఆసీస్ టెస్ట్ సిరీస్ కోసం బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సచిన్‌ను నియమించాలి. తొలి టెస్టు, రెండో టెస్టుకు చాలా సమయం ఉంది. ఈ రోజుల్లో కన్సల్టెంట్‌ల నియామకం సర్వసాధారణం. నేను చెప్పింది ఓసారి బీసీసీఐ ఆలోచన చేయాలి’ అని డబ్ల్యూవీ రామన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాపై 39 టెస్టులు ఆడిన సచిన్‌ 3,630 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 20 టెస్టులలో 1,809 రన్స్ బాదాడు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇబ్బందిపడగా.. సచిన్ సలహాలతో రాణించాడు.

Show comments