AUS vs IND: రెండో వన్డేలోనూ భారత్ పరాజయం.. సిరీస్ పాయే!

  • రెండో వన్డేలోనూ భారత్ పరాజయం
  • మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ హాఫ్ సెంచరీలు
  • 25న నామమాత్రమైన మూడో వన్డే
Ind Vs Aus

Ind Vs Aus

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 45.5 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కొన్నోలీ (57; 51 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలు చేశారు. మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఈ ఓటమితో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. నామమాత్రమైన మూడో వన్డే 25న జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ రోహిత్‌ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (44; 41 బంతులు, 5 ఫోర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా 4, జేవియర్‌ బ్రేట్‌లెట్‌ 3, మిచెల్ స్టార్క్‌ 2 వికెట్లు పడగొట్టారు.