నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనీ పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారంలో ఉండగా మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్లతో దాడి చేశాడు. అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనిపల్లిలో ఇవాళ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడిని తిరుపతయ్ గా పోలీసులు గుర్తించారు. తిరుపతయ్ కు మతిస్థిమితం లేదని.. తరచూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులపై ఇలాగే దాడులు చేస్తుంటాడని స్థానిక ప్రజలు చెబుతున్నారని ఎస్ఐ వీరబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Minister Harish Rao: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసినా అంగీకరిస్తా..
కాగా, అచ్చంపేటలో గత శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. ఆదివారం డిశ్ఛార్జి అయిన బాలరాజు.. ఇవాళ ప్రచారం చేస్తుండగా ఈ ఘటన మరోసారి చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి.