Atreyapuram Putharekulu: ఒక్కో ప్రాంతానికి ఒక్కో విభిన్నమైన సంస్కృతి.. విభిన్నమైన ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్న ఈ పరిస్థితి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.. ఇక, కొన్ని ప్రాంతాలనైతే.. అక్కడ ఫేమస్ అయిన ఆహారం, స్వీట్ పేర్లను కూడా జోడించి పిలిచేస్తుంటారు.. ఈ కోవలో మన ఆంధ్రప్రదేశ్‌కే సొంతమైన కొన్ని వంటకాలు, ప్రత్యేక రుచులు వున్నాయి. బందరు లడ్డూ, నెల్లూరు చేపల పులుసు, వేటపాలెం జీడి పప్పు పాకం, మాడుగుల హల్వయే కాదు.. ఆత్రేయపురం పూతరేకులు అంటూ తెలియనివారు ఉండరు.. ఆత్రేయపురం అనగానే పూతరేకులు గుర్తుకు వచ్చినట్టుగానే.. పూతరేకు అనగానే ఆత్రేయపురం కూడా గుర్తుకు రావాల్సిందే.. అంతలా ఆత్రేయపురం పూతరేకు ఖ్యాతి పొందింది.. తాజాగా, మరో అదురైన గుర్తింపును సొంతం చేసుకుంది మన ఆత్రేయపురం పూతరేకు.. భౌగోళిక గుర్తింపుతో అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిటీతో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేర్చింది..
ఇప్పటికే జియోగ్రాఫికల్ ఐడెంటిటీని బందరు లడ్డూ, తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ, ఉప్పాడ జాంధానీ, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, అరకు కాఫీ, ధర్మవరం చీర.. ఇలా చాలానే సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకు కూడా ఆ జాబితాలో చేరిపోయింది.. ఓ ఊరికో లేదా ఓ ప్రదేశానికో ప్రత్యేకతను ఆపాదించే ఉత్పతులకు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ ఇస్తూ వస్తారు.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలో ఉండే ఈ వెసులుబాటు.. ఎంతో విశిష్టత, స్థానికతతో కూడిన చరిత్ర, గ్రామ భాగస్వామ్యం ఉంటే తప్ప సాధ్యం కాదనే చెప్పాలి.. అలాంటి జాబితాలో ఆత్రేయపురం పూతరేకు స్థానం పొంది.. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేసింది.
కాగా, ఆత్రేయపురం పూతరేకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. పూతరేకులకు పుట్టిల్లుగా ఉంది ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం. వందేళ్లకు పైబడి చరిత్ర ఈ పేపరు స్వీటు సొంతం.. అసలు పూతరేకుల ఆలోచన ఎలా వచ్చిందనే విషయంలోకి వస్తే.. పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేయపురానికి కోడలిగా వచ్చింది. అప్పట్లో అన్నం వారుస్తుంటే గంజికుండపై రేకులాంటి పదార్థం ఏర్పడింది.. అది గమనించిన ఆ మహిళ.. దానిని టేస్ట్ చేసింది.. ఏదో కొత్తగా అనిపించడంతో పూతరేకుల తయారీకి శ్రీకారం చుట్టింది.. అలా ఆత్రేయపురం పూతరేకు పుట్టింది.. మొదట్లో ఒక సామాజిక వర్గం మహిళలే రేకులు తయారు చేసి పంచదార అద్దేవారు. కాలక్రమంలో ఇది అన్ని వర్గాలవారు అనుసరించారు.. ఉపాధిగా మలుచుకున్నారు. ప్రస్తుతం 400 కుటుంబాలకు పైగా పూతరేకుల తయారీలో జీవనం సాగిస్తున్నారు.. ఇక, గంజికుండపై మొదలైన పూతరేకు జర్నీ.. క్రమేపీ అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త రుచులను, రూపాన్ని సంతరించుకుంది.. పంచదార, బెల్లం.. పప్పులు జోడిండిచి.. ఇలా వివిధ రుచులలో ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి.
అయితే, ఆత్రేయపురం పూతరేకుకు భౌగోళిక గుర్తింపు అంతా ఈజీగా ఏం రాలేదు.. కొన్ని నెలల ముందు చైన్నె కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ మొదలు కాగా.. ఆధారాలతో సహా హాజరుకావాలని ఇక్కడివారికి ఆహ్వానం వచ్చింది.. దీంతో.. ఆత్రేయపురం నుంచి ఏడుగురు జీఐ కార్యాలయానికి వెళ్లారు. ఇక, వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు వీరిని లోతుగా ప్రశ్నించారు.. దాని పుట్టుక, పూర్వోత్తరాలు.. కాలక్రమంలో మారుతూ వచ్చిన విధానం.. అన్నింటిపై వివరాలు సేకరించారు.. తమ ఊరితో ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్న పూతరేకుకు భౌగోళిక గుర్తింపు రావాలని ఆత్రేయపురం వాసులు ప్రయత్నించారు.. మూడేళ్లుగా దీనికోసం ప్రయత్నాలు చేశారు.. ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల సంక్షేమ సంఘంతోపాటు మరికొందరు ఈ ప్రయత్నాల్లో నిమగ్నం కాగా.. ఇక, ఆత్రేయపురం వచ్చి పూతరేకుకూ ఈ గ్రామానికి ఏర్పడిన విడదీయరాని బంధంపై కూడా అధ్యయనాలు జరిగాయి.. మొత్తంగా ఇప్పుడు ఆ అరుదైన గౌరవాన్ని అందుకుంది ఆత్రేయపురం పూతరేకులు.