Site icon NTV Telugu

Sudan: సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి

Sudan

Sudan

Sudan: సూడాన్ దేశం సైనిక వర్గాల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. దేశంలో సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. 12 వారాలుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ రెండు విభాగాలకు చెందిన అధిపతుల మధ్య పోరు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. తాజాగా పశ్చిమ ఒమ్‌దుర్‌మాన్‌పై సూడాన్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో కనీసం 22 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్ జంట నగరమైన ఒమ్‌దుర్మాన్ మరియు బహ్రీలలో ఏప్రిల్ నెలలో జరిగిన పోరాటంలో పారామిలిటరీ దళాలు ఆధిపత్యం చేలాయించాయి. ఈ నేపథ్యంలో సైన్యం తాజగా వైమానిక దాడులు జరిపింది.

Read Also: Threads: దమ్మురేపుతున్న థ్రెడ్స్.. భారత్‌లోనే అధిక డౌన్‌లోడ్స్..

అయితే ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పలు దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించినా, కొలిక్కి రాలేదు. దేశం తీవ్ర అంతర్యుద్ధం దిశగా వెళ్తున్నాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిపిన ప్రయత్నాల్లో భాగంగా పారామిలిటరీ, సైన్యం ఏకీకరణ విషయం ఈ సంక్షోభానికి కారణమైంది. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో కనీసం 1,133 మంది మరణించారు. రాజధానితో పాటు కోర్డోఫాన్, డార్ఫర్ ప్రాంతాల్లో కూడా ఘర్షణలు చెలరేగాయి. రాజధానితో పాటు అన్ని ప్రాంతాల నుంచి 7 లక్షల మంది పొరుగుదేశాలకు పారిపోయారు. దీంతో పాటు దేశంలో మహిళలు, బాలికల అపహరణ, అత్యాచారాలకు గురవుతున్నారు.

సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశం సూడాన్ అట్టుడుకుతోంది. ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు కారణంగా ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో రెండు దళాల పోరు తారాస్థాయికి చేరింది.

Exit mobile version