Site icon NTV Telugu

Asia Cup 2023: నేటి నుంచే ఆసియా కప్‌ 2023.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌, నేపాల్‌ ఢీ! చరిత్ర టీమిండియాదే

Asia Cup 2023 Captains

Asia Cup 2023 Captains

Asia Cup 2023 1st Match Between Pakistan vs Nepal: ఆసియా కప్‌ 2023 నేటి నుంచి మొదలుకానుంది. పాకిస్థాన్‌, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో బుధవారం ముల్తాన్‌లో పాక్‌, నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్‌ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ టోర్నీకి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్లేయర్స్ ఆడుతున్నది ఆసియా కప్‌లో అయినా.. అందరి దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచకప్‌కు ముందు ఫామ్ అందుకోవడానికైనా లేదా ఏదైనా ప్రయోగాలు చేయడానికైనా ఆసియా కప్‌ను టీమ్స్ ఉపయోగించుకోనున్నాయి.

ప్రపంచకప్‌ 2023లో ఆడే జట్లలో 5 టీమ్స్ ఆసియా కప్‌ 2023లో ఆడుతున్నాయి. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ సహా నేపాల్‌ తొలిసారి ఈ టోర్నీలో ఆడుతుంది. మాజీ విజేతలు భారత్‌, పాక్, శ్రీలంకలే ఆసియా కప్‌లో మేటి జట్లు అయినా.. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లనూ తీసిపారేయలేం. ఇక రౌండ్‌ రాబిన్‌ విధానంలో జరిగే టోర్నీలో రెండు గ్రూపులు ఉన్నాయి. గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్‌ 4లో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్‌-2 టీమ్స్ ఫైనల్‌కు చేరుకుంటాయి.

ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్‌ జరగ్గా.. శ్రీలంక టైటిల్ గెలిచింది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్‌ ఇప్పుడు ఫేవరెట్‌గా కనిపిస్తుండగా.. వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హోదాలో పాకిస్తాన్‌ బరిలోకి దిగుతోంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న క్యాండీలో పాకిస్తాన్‌తో ఆడుతుంది. ఇక అధికారికంగా ఆసియా కప్‌ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌ వద్దే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్‌ అంగీకరించకపోవడంతో.. హైబ్రీడ్‌ మోడల్‌లో టోర్నీని తటస్థ వేదికల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లలో 4 పాకిస్తాన్‌లో జరుగుతుండగా.. శ్రీలంక 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ మ్యాచ్‌లు అన్ని లంకలోనే జరగనున్నాయి.

Also Read: IND vs PAK: గంటలోపే ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డు.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ క్రేజ్ మాములుగా లేదు!

ఇది 16వ ఆసియా కప్‌. గత 15 ఆసియా కప్‌ల్లో 13 వన్డే ఫార్మాట్లోనే జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో జరిగాయి. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో ఆసియా కప్‌ ఉంది. ఈ టోర్నీలో భారత్ ఏడు సార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది. అంటే ఆసియా కప్‌లో చరిత్ర టీమిండియాదే. 1984లో మొదలైన టోర్నీలో భారత్ 49 వన్డేలు ఆడి 31 గెలిచింది.

 

Exit mobile version