NTV Telugu Site icon

US: అమెరికా చదువు కోసం తండ్రినే చంపేశాడు.. బండారం బయటపడడంతో చివరికిలా..!

Abe

Abe

అమెరికా వెళ్లేందుకు.. అక్కడ చదువు కునేందు అడ్డదారులు తొక్కాడు ఓ భారతీయ విద్యార్థి. అందుకోసం ఏకంగా కన్న తండ్రినే పత్రాల్లో చంపేశాడు. తొలుత పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి.. ఇప్పుడు ఏకంగా స్కాలర్‌షిప్‌తో యూఎస్ కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమార్గాలను ఎంచుకుని కటకటాలపాలయ్యాడు. బండారం బయటపడడంతో కాలేజీ నుంచి బహిష్కరణకు గురవడమే కాకుండా నేరం రుజువైతే ఇరవై ఏళ్లు జైలు జీవితం అనుభవించాల్సిన దుస్థితిని తెచ్చుకున్నాడు.

భారత్‌కు చెందిన ఆర్యన్‌ ఆనంద్‌.. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లేహైలో అడ్మిషన్‌ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు.. పూర్తి స్కాలర్‌షిప్‌ కోసం అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు తప్పుడు డెత్ సరిఫిక్టెట్ సృష్టించాడు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. చివరికి అతడి అత్యుత్సాహంతో నిజస్వరూపం బయటపడేలా చేసింది. గొప్పలకు పోయి.. ప్రగల్భాలు పలుకుతూ అసత్యాలతో తన జీవితాన్ని నిర్మించుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును సవివరంగా వివరించాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్‌షిప్‌ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి పూసగుచ్చినట్లుగా వివరించాడు. ఈ తీరే కొంపముంచింది.

ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. కాలేజీ యాజమాన్యం పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో జూన్ 12న ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసు గనుక రుజువైతే దాదాపు 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక యూనివర్సిటీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురయ్యాడు. ఇక దుకాణం సర్దుకుని త్వరలోనే ఇండియాకు రానున్నాడు.