NTV Telugu Site icon

Kejriwal: రాహుల్‌ను పీఎంగా అంగీకరిస్తారా? కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..!

Keje

Keje

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఇక శనివారం (మే 25) ఆరో దశ పోలింగ్ జరగనుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా కమలం పార్టీని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి రేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉంటారా? అలా కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆప్ ఒక చిన్న పార్టీ అని, కేవలం 22 సీట్లలో పోటీ చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై సమాధానమిస్తూ.. అలాంటి చర్చలేవీ ఇంతవరకూ జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాధానమిచ్చారు.

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైల్లో పెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.