మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను వ్యతిరేకించేందుకు ఈడీ 48 గంటల సమయం కోరింది. రేపు డ్యూటీ జడ్జి ముందు ఈ వాదనలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. రూ.లక్ష బాండ్‌పై కేజ్రీవాల్ రేపు (శుక్రవారం) తీహార్ జైలు నుంచి బయటకు రావచ్చని రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.
READ MORE: New Suv Car : త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రముఖ కంపెనీల కూపే ఎస్ యూవీ కార్స్..
కాగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నిన్న కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది. కేజ్రీవాల్ పీఎంఎల్‌ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి(Vikram Chaudhary) వాదించారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.