India Beat South Africa in 1st ODI: జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్స్ పోగొట్టాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
స్వల్ప ఛేదనలో భాగంగా భారత్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌కు శ్రేయస్ అయ్యర్ జతకలిశాడు. ఈ ఇద్దరు దక్షిణాఫ్రికాకు మరో అవకాశమే ఇవ్వలేదు. క్రీజులో కుదురుకునేదాకా సింగిల్స్, డబుల్స్ తీసిన సాయి.. గేర్ మార్చి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. మరోవైపు అయ్యర్ కూడా ఫోర్లు బాదాడు. పెహ్లూక్వాయో వేసిన 16వ ఓవర్లో సాయి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది అర్థ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ (1 నాటౌట్)తో కలిసి సాయి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
Also Read: Arshdeep Singh: తొలి పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు!
అంతకుముందు భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) విజృంభించడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. ఓపెనర్ టోనీ డిజోర్జి (28), కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (12), షంసి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్ మహరాజ్ (4) పరుగులు చేశారు. రీజా హెండ్రిక్స్, వాండర్ డసెన్, వియాన్ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగారు.