NTV Telugu Site icon

AP Elections 2024 Results: గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. పల్నాడులో భారీ బందోబస్తు..

Gnt

Gnt

AP Elections 2024 Results: ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో , బాపట్ల జిల్లా కౌంటింగ్‌కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గుంటూరు జిల్లాలో 2500 మంది పోలీసులతో పోలీస్ పహార ఏర్పాటు చేయగా.. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 3000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.. నియోజకవర్గ ఓటర్లను బట్టి గరిష్టంగా 22 రౌండ్లు కౌంటింగ్ జరిగే అవకాశం ఉండగా.. అసెంబ్లీ స్థానానికి, పార్లమెంటు స్థానానికి, ప్రత్యేక హాళ్లు కేటాయించారు అధికారులు.. ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Read Also: Mobile Wallet: ఫోన్ ల వెనుక వాలెట్ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా?

ఇక, రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపుతో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఫలితం తాడికొండ, పల్నాడు జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుండి వెలువడే అవకాశం ఉందంటున్నారు. అత్యధికంగా గురజాల నియోజకవర్గంలో 304 పోలింగ్ బూతులు ఉండగా.. గురజాల కౌంటింగ్ అధిక సమయం కొనసాగగనుంది. పల్నాడు జిల్లాలో మొత్తం 230 టేబుళ్లు ఏర్పాటు చేశారు.. ఒక్కొక్క రౌండ్ లెక్కింపు 25 నుండి 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది.. పల్నాడు జిల్లాలో 1300 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనబోతున్నారు.. గుంటూరు జిల్లాలో 1500 మంది వరకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు సిబ్బంది.. బాపట్ల లోను 1500 మంది తో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.. బాపట్ల జిల్లాలో తొలి ఫలితం బాపట్ల నియోజకవర్గం నుండి వచ్చే అవకాశం ఉంది.. ఇక, ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద 400 నుండి 500 మంది సాయుధ బలగాలు, పోలీసులతో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు అధికారులు.