Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!

Arnab Cyclone

Arnab Cyclone

Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నబ్‌’ మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. విశాఖపట్నానికి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను, అక్టోబర్ 28 ఉదయం బాపట్ల, విశాఖ మధ్య యానం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ తుఫానుకు ‘అర్నబ్‌’ (సముద్రం) అనే పేరును బంగ్లాదేశ్ ఖరారు చేసింది.

తుఫాను తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో ముందస్తు చర్యల్లో భాగంగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గర్భిణులను ముందే ఆసుపత్రులకు చేర్చడంతో పాటు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందుగానే 25 వేల విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. ఒడిశాలోని గంజం, గజపతి, రాయగడ, మల్కన్‌గిరి, కొరాపుట్, నవరంగ్‌పూర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆరు జిల్లాల్లో అక్టోబర్ 27 నుంచి 29 వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు.

రైలు ప్రయాణికులకు కూడా భారీ ఇబ్బందులు తప్పలేదు. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే 53 రైళ్లను రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది. విజయవాడ, రాజమండ్రి, మచిలీపట్నం, నరసాపురం, భీమవరం, కాకినాడ పోర్ట్, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్టోబర్ 27, 28 తేదీల్లో నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ముందుగానే సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జోనల్ స్థాయిలో 24 గంటలూ పనిచేసే వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు.

కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో జాతీయ సంక్షేమ నిర్వహణ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలపై సమీక్షించింది. త్రివిధ దళాలు, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఎప్పుడైనా రంగంలోకి దిగేలా సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని ముఖ్యమైన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేవలం ఏపీ, ఒడిశా మాత్రమే కాకుండా ఈ తుఫాను ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడనుంది. పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో అక్టోబర్ 28 నుంచి 30 వరకు భారీ వర్షాలు పడతాయని, డార్జిలింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా మారనున్నందున మత్స్యకారులు అక్టోబర్ 29 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ప్రజలందరూ అధికారిక సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.