ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బాను నుండి విడిపోతున్నారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్, సైరా వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరా నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య దూరాన్ని సృష్టించాయని పేర్కొన్నారు.
విడాకులపై ఏఆర్ రెహమాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని, అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బంధువులు, స్నేహితులు, అభిమానులు తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని రెహమాన్ పేర్కొన్నారు. విడాకులపై రెహమాన్ తనయుడు అమీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘అందరికీ మనవి చేస్తున్నా.. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి. మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
1995లో ఏఆర్ రెహమాన్, సైరా బానులు పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. సైరాతో తన తల్లి పెళ్లి ఖాయం చేసిందని రెహమాన్ గతంలో చెప్పారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక రెహమాన్ చివరిగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమాకి సంగీతం అందించారు. ఛావా, థగ్ లైఫ్, గాంధీ టాక్స్ సహా ఆలు చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు.