Trump Tariffs Hit AP Aqua Farmers: ఏపీలోని ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్ భారీగా పడనుంది. ముఖ్యంగా ఆక్వా రంగానికి కేరాఫ్‌గా ఉన్న పశ్చిమ గోదావరిలో తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడంతో.. ఆక్వా రంగం ఒడిదుడుకులకు గురవనుంది. రైతులపై 25 శాతం పన్ను భారం పడనుంది. ఇప్పటివరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా సుంకం ఉన్న విషయం తెలిసిందే. లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే.. ఇప్పుడు రూ.25 వేలు పన్ను రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
2023-24లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2.37 బిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ ఎగుమతి అయింది. ఇందులో రొయ్యల వాటానే 76 శాతంగా ఉంది. ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటన చేసిన రోజునే రొయ్యల ధరలను ఎగుమతి దారులు భారీగా తగ్గించేశారు. దాంతో ఆక్వా కల్చర్ మీద ఆధారపడి ఉండే కోల్డ్ స్టోరేజీ, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాలలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావం పడనుంది. కనీసం ఫీడ్ రేట్లు అయినా తగ్గించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల ఎగుమతి విషయంలో ప్రత్యామ్నాయలపై రైతులు దృష్టి పెడుతున్నారు.
Also Read: Domestic Violence: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. భీమిలిలో భర్తపై వేడినీళ్లు పోసిన భార్య!
భారత్ వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్న కారణంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుంకాలకు సంబంధించి ఏప్రిల్‌లోనే ప్రకటన చేసినప్పటికీ.. అమలుకు గడువు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్ సుంకాలు విధిస్తోందని ఇటీవల స్కాట్లాండ్ పర్యటనలో ట్రంప్ అన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరిగితే.. అందులో 70 శాతానికి పైగా ఏపీ నుంచే వెళ్తాయి. ఏపీ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి.
