Site icon NTV Telugu

APP vs BJP: పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. బీజీపీ-ఆప్‌ మధ్య ట్వీట్ వార్..

Raghav Chadha

Raghav Chadha

APP vs BJP: పార్లమెంట్‌ ఆవరణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. పార్లమెంట్‌ నుంచి బయటకు వస్తున్న రాఘవ్‌ చద్దాను తలపై పొడిచింది ఓ కాకి. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది BJP. దీనికి అబద్దం ఆడితే కాకి పోడుస్తుందనే హిందీ సామెత – జూట్‌ బోలే కవ్వా కాటేను క్యాప్షన్‌గా పెట్టింది. మణిపూర్‌ అల్లర్లపై ఇటీవల పార్లమెంట్‌పై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. రాజ్యసభలో రాఘవ్‌ చద్దా సహా ఆమ్‌ ఆద్మీ నేతలు రచ్చ చేశారు. సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్న ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయాలని అధికారపక్షం కోరింది. అయితే, తమ పార్టీ నేతపై సస్పెన్షన్‌ విషయంలో ఓటింగ్‌కు పట్టుబట్టారు రాఘవ్‌ చద్దా. అయితే, అతని వినతిని చైర్మన్‌ ధన్‌ఖడ్‌ తోసిపుచ్చారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజు వరకూ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు చైర్మన్‌ ధన్‌ఖడ్‌ ప్రకటిస్తున్న సమయంలో రాఘవ్‌ చద్దా సహా ఆప్‌ నేతలు రాజ్యసభ వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. రాఘవ్‌ చద్దా రూల్స్‌ బుక్‌ను చూపిస్తూ నిరసన తెలిపారు. రాజ్యసభ వాయిదా పడడంతో ఫోన్లో మాట్లాడుతూ పార్లమెంట్‌ బయటకు వచ్చిన రాఘవ్‌ చద్దాపై కాకి దాడి చేసిందంటూ BJP ట్వీట్‌ చేసింది. సభలో అబద్దం చెప్పడం వల్లే ఇలా జరిగిందన్నది కమలనాథులు సెటైర్లు పేల్చారు. అనుకోని సంఘటనను అవకాశంగా మలుచుకొని.. అబద్ధాడితే ఇలాగే కాకి కరుస్తుందంటూ ట్వీట్స్ చేశారు.

కాకి దాడిపై BJP సెటైర్‌కు రాఘవ్‌ చద్దా గట్టిగానే కౌంటరిచ్చారు. రామచంద్ర కహే గయే సియా సే ఐసా కలియుగ్‌ ఆయేగా, హన్స్‌ చుగేగా దానా దుంకా… కవ్వా మోతీ కాయేగా అంటూ పోస్టు చేశారు. అంటే, హంస గింజలను, కాకి ముత్యాలను తినే రోజు కలియుగంలో వస్తుందని సీతకు రాముడు చెప్పాడు అంటూ తనను ముత్యంతో పోల్చుకున్నాడు చద్దా. మొత్తానికి BJP ట్వీట్‌కు గట్టిగానే కౌంటరిచ్చారు చద్దా. ఇంతకీ పార్లమెంట్ ఆవరణలోకి కాకి ఎలా వచ్చిందో.. ఎంపీనే ఎందుకు టార్గెట్ చేసిందో గానీ, ఇలా బీజేపీ, ఆప్ మధ్య మాటలయుద్ధానికి మాత్రం అవకాశం ఇచ్చింది.

https://twitter.com/raghav_chadha/status/1684137560157859841

Exit mobile version