APMDC Office Opened in AP Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు.
జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను సీఐడీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. మైనింగ్ శాఖ కీలక డాక్యుమెంట్లు బయటకు వెళ్తాయనే సమాచారంతో సీఐడీ రెండు కార్యాలయాలను సీజ్ చేసింది. అప్పటి నుంచి సిబ్బంది విధుల్లోకి రాలేదు. నిన్న మైనింగ్ శాఖ ఇంఛార్జిగా యువరాజ్ బాధ్యతలు చేపట్టగా.. నేడు కార్యాలయాలను అధికారులు ఓపెన్ చేశారు.
Also Read: Pawan Kalyan: ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ!
గత ప్రభుత్వంలో అత్యంత అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విభాగం ఏదైనా ఉందంటే.. అది గనుల శాఖే. ఇసుక, బొగ్గు, బీచ్‌శాండ్, బెరైటీస్, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకం ప్రక్రియలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ అక్రమాలకు గనుల శాఖ ఉన్నతాధికారులే కొమ్ముకాశారనే విమర్శలున్నాయి. గనులశాఖ సంచాలకుడు, ఏపీఎండీసీ ఇన్‌ఛార్జి ఎండీ విజీ వెంకటరెడ్డి బదిలీ కాగానే.. కార్యాలయాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని సీజ్ చేశారు.