APJAC: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు చెల్లింపులు, రాష్ట్ర ఆదాయానికి సంబంధించి చేసిన ప్రస్తావనలపై ఏపీజేఏసీ (APJAC) అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 98% ఉద్యోగులకే ఖర్చవుతున్నట్లు శ్వేతపత్రంలో పేర్కొనడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగుల జీతాల కోసం చేస్తున్న ఖర్చు రాష్ట్ర మొత్తం వ్యయంలో 37% మాత్రమేనని అన్నారు. జూలై 22న జరిగిన జీఓఎం సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని తాము ఆశించామని బొప్పరాజు చెప్పారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు చూపించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
ఉద్యోగుల ఖర్చు 98% ఎలా?
సీఏజీ లెక్కలను పరిశీలిస్తే.. 2025-26లో రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.2,26,808 కోట్లుగా ఉందని, ఇందులో జీతాల కోసం రూ.84,841 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉందని బొప్పరాజు పేర్కొన్నారు. అంటే రాష్ట్ర మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగుల జీతాల వాటా సుమారు 37% మాత్రమేనన్నారు. రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,42,926 కోట్లుగా ఉంటే.. అందులో ఉద్యోగుల జీతాల కోసం చేసే ఖర్చు సుమారు 59%గా ఉంటుందని చెప్పారు. మొత్తం ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల జీతాల వాటా సుమారు 47% ఉంటుందని వివరించారు. అలాంటప్పుడు ఉద్యోగులపై రాష్ట్ర ఆదాయంలో 98% ఖర్చవుతున్నట్లు ఎలా చూపించారని ఆయన ప్రశ్నించారు.
తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య:
రిటైర్మెంట్ల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఏటా తగ్గుతోందని బొప్పరాజు తెలిపారు. 2024లో పదవీ విరమణ వయసు ఆధారంగా 13,624 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని అన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని, అదే సమయంలో మిగిలిన ఉద్యోగులపై పని భారం, ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఉద్యోగుల అవసరం ఉన్నప్పుడే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లను ప్రకటిస్తుందని బొప్పరాజు పేర్కొన్నారు. అలాంటప్పుడు ఉద్యోగుల వల్ల ప్రభుత్వ ఖర్చు భారీగా పెరుగుతున్నట్లు చూపించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిలో సగం మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలాంటి పూర్తి ప్రయోజనాలు లేకుండా నియమించుకుంటున్నారని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ప్రభుత్వ శాఖల్లో పని భారం మాత్రం పెరుగుతోందన్నారు. పెన్షనర్లకు గ్రాట్యుటీ మినహా మిగిలిన చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు, చెల్లింపులపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
ఈ నెల 15లోపు క్లారిటీ ఇవ్వాలి..
ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై ఈ నెల 15లోపు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్‌ను ఇప్పటివరకు ఎందుకు నియమించలేదో ప్రభుత్వం వెల్లడించాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎంత మొత్తం రావాల్సి ఉందో ప్రభుత్వం చెప్పలేదని, ఇందులో పారదర్శకత ఎక్కడుందని నిలదీశారు. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏలను ఎందుకు ప్రకటించడం లేదని బొప్పరాజు ప్రశ్నించారు. శాసనసభ్యులు రూపాయి బిల్లు పెట్టినా చెల్లింపులు చేస్తున్నారని, మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని ఉద్యోగుల చెల్లింపుల వివరాలపై తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని బొప్పరాజు కోరారు. ఉద్యోగులపై వాస్తవ ఖర్చును స్పష్టంగా వెల్లడించి, వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

