AP ZP Seat Sharing 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ స్థానాల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య జిల్లా పరిషత్ స్థానాల పంపకంపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా జనసేనకు కేటాయించే జెడ్పీ స్థానాల సంఖ్యపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి ఆరు స్థానాలు కేటాయించినట్లు సమాచారం. అయితే మరో రెండు స్థానాలు కూడా తమకు ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే కీలక భేటీతో స్థానాల పంపకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కూటమి పార్టీల మధ్య జరిగిన చర్చల్లో జనసేనకు ఆరు జెడ్పీ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క జెడ్పీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేటాయింపుతో జనసేన పూర్తిగా సంతృప్తి చెందలేదని సమాచారం. చిత్తూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో మరో రెండు స్థానాలు ఇవ్వాలని పార్టీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది లేదా తొమ్మిది జెడ్పీ స్థానాలు కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జెడ్పీ స్థానాల పంపకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు కూటమి నేతలు మరోసారి సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేడు భేటీ కానున్నారు. నిన్న కూడా కూటమి పార్టీల మధ్య సమావేశం జరిగినప్పటికీ జెడ్పీ స్థానాల విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సమావేశం కీలకంగా మారింది. సాయంత్రానికి స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమిలో భాగంగా బీజేపీకి కూడా ఒక జెడ్పీ స్థానాన్ని కేటాయించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఏ జిల్లాలో ఆ స్థానాన్ని కేటాయించాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనసేనకు అదనపు స్థానాలు కేటాయించాలన్న డిమాండ్, బీజేపీకి ఒక స్థానం ఇవ్వాలన్న ప్రతిపాదన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సమన్వయం చేయాల్సి ఉంది. నేటి భేటీలో ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కేటాయింపు విషయంలో కూటమి అధిష్టానం స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో పార్టీ బలం, స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక నేతలు సర్దుబాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పంపకం స్థానిక స్థాయిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నేడు కూడా జెడ్పీ స్థానాల పంపకంపై స్పష్టత రాకపోతే.. స్థానిక పరిస్థితులను బట్టి ఎన్నికల తర్వాత సర్దుబాటుపై దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం. కూటమి పార్టీల మధ్య విభేదాలు రాకుండా, స్థానికంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

