NTV Telugu Site icon

Rain Alert: ఏపీకి చల్లని కబురు.. ఈ ప్రాంతాలకు వర్షసూచన!

Ap Weather

Ap Weather

Rain Alert: ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం ఓ ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర- దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది.

Read Also: Bengaluru: బెంగళూర్ వర్షంలో ఐదుగురిని కాపాడిన “మహిళ చీర”

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఏపీలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చి అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల గంటకు 40 కి.మీ. నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరి కొన్ని ప్రాంతాల్లో గంటకు 30- 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.