పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతం, దానిని నానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. నేడు అల్లూరి అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.
Also Read: CPI Ramakrishna: రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు.. అమిత్ షాని ప్రధాని వెనకేసుకొస్తున్నారు!
బుధవారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని జగన్నాథ్ కుమార్ తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కోస్తా ఆంధ్ర తీరంలో ఉన్న అన్ని పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నేడు, రేపు కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 5-6 రోజులుగా మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదు. మరో 3-4 రోజులు కూడా పడవలు ఒడ్డుకే పరిమితం కనున్నాయి. ఇక భారీ వర్షాలు కురిసే జిల్లాలలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.