దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. గురువారం ఉదయం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అనంతరం రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ.. తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపానుకు ‘ఫెన్‌గల్’గా నామకరణం చేశారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం వరకు తుపాను తీవ్రత కొనసాగుతుందని.. శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపింది. ఇక రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్ఠంగా గంటకు 75 కిమీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.