బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పింది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.
Also Read: High Cholesterol: ఈ భాగాలలో నొప్పిగా ఉందా? అధిక కొలెస్ట్రాల్ కావచ్చు.. జాగ్రత్త సుమీ
డిసెంబర్ 16 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఓడ రేవులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కోస్తాంద్ర, రాయలసీమపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా.