AP Weather Report Today: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో ఈ రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, నరసన్నపేట, టెక్కలి, పలాస మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది. అలాగే పిడుగుల ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

