మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా శనివారం తెలిపారు. మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన రోజున ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో శాసనసభ, సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన రోజుకి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 గా ఉంటే ఏప్రిల్ 2కి 2,09,16,389కు పెరిగినట్లు తెలిపింది. పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కు పెరిగినట్లు పేర్కొంది. నామినేషన్లు దాఖలు చివరి రోజు వరకు కొత్త ఓటర్లను చేర్చుకొనే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ రెండున్నర నెలల్లో 2,56,781 మంది ఓటర్లు పెరిగారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని, దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 10 లక్షలు దాటుతోందంటున్నారు.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య 3,69,29,330 (సర్విస్, థర్డ్ జెండర్ ఓట్లు కాకుండా)గా ఉంటే అది ఇప్పుడు 4,10,60,555కు పెరిగింది. అంటే 41,31,225 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019లో పురుష ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా ఇప్పుడు 2,01,44,166కు, మహిళా ఓటర్లు 1,86,04742 నుంచి 2,09,16,389కు పెరిగారు.
సర్విసు, ఎన్నారై, థర్డ్ జెండర్ ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు.
