Site icon NTV Telugu

Crime News: కార్లు రెంటుకు తీసుకొని 50 లక్షల టోకరా!

Vijayawada Crime News

Vijayawada Crime News

పేకాట, ఆన్​లైన్​ బెట్టింగ్​లకు అలవాటుపడిన ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలామంది పేకాట, బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పేకాట, ఆన్‌లైన్‌ బెట్టింగ్, మద్యంకు బానిసైన ఓ వ్యక్తి కార్లు రెంటుకు తీసుకొని.. యజమానులకు టోకరా వేశాడు. ఈఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ పెనమలూరులో నివాసం ఉంటున్న కుందేటి సాయిరాం అనే వ్యక్తి పేకాట, ఆన్​లైన్​ బెట్టింగ్​ సహా మద్యంకు బానిసయ్యాడు. ముఖ్యంగా ​ఆన్​లైన్​ బెట్టింగ్​లో చాలా డబ్బు పోగొట్టాడు. ఆన్​లైన్​ బెట్టింగ్​కు బానిసై ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ట్రావెల్స్ తిప్పే యజమానులను సాయిరాం టార్గెట్ చేశాడు. సాయిరాం విజయవాడలోని పలు ప్రాంతాల్లో కార్ రెంటుకు తీసుకుని.. మొదట్లో ఒకటి, రెండు అద్దెలు కరెక్టుగా ఇచ్చేవాడు. నమ్మకం కుదిరాక పది రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పి.. కార్లు తీసుకెళ్లి వేరే వేరే ప్రాంతాల్లో తాకట్టు పెట్టేవాడు. వచ్చిన డబ్బుతో జూదాలు ఆడేవాడు.

విజయవాడ కుమ్మరి పాలెం ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే ట్రావెల్స్ యజమాని దగ్గర మార్చి 13వ తారీఖున మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును సాయిరాం అద్దెకు తీసుకున్నాడు. కారు ఇంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో.. ట్రావెల్స్ యజమాని కళ్యాణ్ భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పడమట, పెనమలూరు పోలీసు స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తేలింది. విజయవాడలో పలు ప్రాంతాల్లో కార్లు రెంటుకు తీసుకొని రూ.50 లక్షల టోకరా వేశాడని తెలిసింది. పోలీసులు సాయిరాం కోసం గాలిస్తున్నారు.

Exit mobile version